శ్రీమద్వాల్మీకి రామాయణము

బాలకాండ , 18 వ సర్గము

శ్రీరామ జననం !

With Sanskrit text in Devanagari, Telugu and Kannada

నిర్వృత్తే తు క్రతౌ తస్మిన్ హయమేధే మహాత్మనః|
ప్రతిగృహ్యా సురా భాగాన్ ప్రతిజగ్ముః యథాగతమ్ ||

తా|| మహాత్ముడైన దశరథ మహారాజు ప్రారంభించిన అశ్వమేథ పుత్త్రకామేష్టి క్రతువులు ముగిసినవి . దేవతలు అందరూ తమతమ హవిర్భాగములు స్వీకరించి స్వస్థానములకు చేరిరి.

బాలకాండ
పదునెనిమిదవ సర్గము
( శ్రీరామ జననం )

మహాత్ముడైన దశరథ మహారాజు ప్రారంభించిన అశ్వమేథ పుత్త్రకామేష్టి క్రతువులు ముగిసినవి . దేవతలు అందరూ తమతమ హవిర్భాగములు స్వీకరించి స్వస్థానములకు చేరిరి.

యజ్ఞదీక్షానియమములు పూర్తికాగానే సేవకులు సైనికులు వాహనములు వెంటరాగా రాజు రాణులతో గూడి పురమున ప్రవేశించెను. యజ్ఞమునకు విచ్చేసిన దేశాధిపతులందరినీ వారి వారి యోగ్యతలనుసరించి సమ్మానించెను. వారును మిక్కిలి సంతోషించి మునిపుంగవుడైన వశిష్ఠమహర్షి కి నమస్కరించి తమతమ దేశములకు బయలు దేరిరి. తమ నగరములకు పోవుచున్న ఆ శ్రీమంతులైన రాజులయొక్క సైనికులు దశరథుడు ఇచ్చిన వస్త్రాభరణముల తో సంతసించినవారై చక్కగా భాసిల్లిరి.

రాజులందరూ వెళ్ళిన పిమ్మట శుభలక్షణసంపన్నుడైన దశరథుడు వశిష్ఠాది మహర్షులు ముందునకు సాగిపోవుచుండగా పురమున ప్రవేశించెను.

నగరప్రవేశానంతరము దశరథుడు ఋష్యశృంగుని సాదరముగా పూజించెను పిమ్మట ఆ మహర్షి తన భార్యయైన శాంతతో గూడి ప్రయాణమయ్యెను . ధీశాలిఅయిన రోమాపాదుడు ఆయనను సపరివారముగా అనుసరించెను. వాఱినందరిని దశరథుడు కొంతదూరము అనుసరించి వీడ్కొలిపెను.

దశరథ మహారాజు వచ్చినవారందరికి వీడ్కొలిపి మిక్కిలి ఆనందించెను.. అనంతరము పుత్త్రప్రాప్తిని గూర్చి ఆలోచించుచూ హాయిగా నివశింపసాగెను.

యజ్ఞము ముగిసిన పిమ్మట ఆరు ఋతువులు గడిచెను. పిమ్మట పండ్రెండవ మాసమున చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగవ పాదమున కర్కాటక లగ్నమున కౌసల్యాదేవిగర్భములో శ్రీరామచంద్ర ప్రభువు జన్మించెను. సూర్యుడు ,అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని ఐదు గ్రహములు తమ ఉచ్ఛస్థానములోఅనగా మేష, మకర, కర్కాటక, మీన, తులా రాసులయందు ఉండిరి. కర్కాటక రాశియందు గురుచంద్రులు కలిసి ఉండిరి. బుధాదిత్యులు మేషమునందు ఉండిరి. అప్పుడు కౌసల్యాదేవి కి శ్రీరామచంద్రుడు జన్మించెను. ఆయన జగన్నాధుడును అన్ని లోకములచే నమస్కరింపబడువాడును, సర్వశుభలక్ష సంపన్నుడును మహాభాగ్యశాలియూ విష్ణ్వంశసంభూతుడును అగు ఇక్ష్వాకువంశ వర్ధనుడు .

రాముడు ఇక్ష్వాకు కుల నందనుడు, విష్ణువులో సగ భాగమైనవాడు, లోహితాక్షుడు మహాబాహువులు గలవాడు, ఎఱ్ఱని కళ్ళు గలవాడు దుందుభివంటి స్వరము గలవాడు. ఆ అమిత తేజస్సుగల పుత్త్రునితో కౌసల్యదేవి, దేవతలలో శ్రేష్ఠుడు వజ్రాయుధము ధరించువాడైన ఇంద్రుని పుత్త్రునిగా పొందిన అదితి వలే ఏంతో శోభించెను.

సత్యపరాక్రమములు గలవాడు , సాక్షాత్ విష్ణువుయొక్క చతుర్థాంశముఅయిన వాడు సర్వగుణ సంపన్నుడు అగు భరతుడనువాడు కైకేయికి జన్మించెను. అప్పుడు వీరులు అన్ని శస్త్రాస్త్రములలో కుశలురు విష్ణ్వంశలతో కూడినవారు అగు లక్ష్మణ శతృఘ్నులు సుమిత్రాదేవి కి జన్మించిరి.

భరతుడు పుష్యమి నక్షత్రయుక్త మీనలగ్నమందు అన్మించుటవలన ప్రసన్న మనస్సు గలవాడయ్యెను. లక్ష్మణ శతృఘ్నులు ఆశ్లేషా నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందు రవి ఉచ్ఛరాశిలో ఉన్నప్పుడు జన్మించిరి. ఆ రాజుకి గుణవంతులు తగినరూపముగలవారు అగు మహాత్ములగు నలుగురుపుత్రుల జననము విడివిడిగా ఆయెను. అప్పుడు గంధర్వులు మధురముగా గానము చేసిరి. అప్సరస గణములు నాట్యము చేసిరి. దేవ దుందుభిలు మ్రోగెను. ఆకాశమునుండి పుష్పవృష్టికురిసెను.

అయోధ్యానగరములో జనులందరితో మహోత్సవములు జరిగినవి. రాజవీధులన్నియూ కోలాహలముతో నటనర్తకుల సంకులముతో గానవాద్య గోష్ఠులతో వందిమాగధుల స్తోత్రపాఠములతో ప్రతిధ్వనించెను. ఆ (దశరథ) మహారాజు వందిమాగధులకు పౌరాణికులకు పారితోషకములనిచ్చెను. బ్రాహ్మణులకు వేలకొలదీ గోధనములను దానము చేసెను.

పుత్త్రులుజన్మించిన పదనొకండు దినముల పిమ్మట దశరథుడు వారికి నామకరణకర్మ చేసెను. వశిష్ఠ మహాముని మహాత్ముడగు జ్యేష్ఠకుమారునకు 'రాముడు' అనియూ , కైకేయీ పుత్త్రునకు భరతుడనియూ, సుమిత్రానందనులకు లక్ష్మణుడు శతృఘ్నుడు అనియూ పరమ ప్రీతితో నామకరణము చేసెను.

రాజు బ్రాహ్మణులకూ, పురజనులకూ , గ్రామవాసులకూ భోజనములు పెట్టెను. బ్రాహ్మణులకు బహువిధములగు రత్నములను బహుకరించెను. పిమ్మట ఆ కుమారులకు జన్మక్రియకు సంబంధించిన సర్వకార్యములను జరిపించెను.

వారిలో జ్యేష్ఠుడైన ధ్వజపతాకమువంటి రాముడు తండ్రికి మిక్కిలి సంతోషముగూర్చుచుండెను. సమస్త ప్రాణులకూ స్వయంభూవలె ఎంతయూ ప్రేమపాత్రుడయ్యెను. ఆ రాజకుమారులందరూ అన్ని వేదములనూ అభ్యశించిరి. వారు శూరులు . ఎల్లప్పుడు ప్రజల హితమునందే ఆశక్తి గలవారు. జ్ఞాన సంపన్నులు. సకల సద్గుణ సంపన్నులు.

వారిలో గూడా రాముడు సత్యప్రాక్రమములు గలవాడు. లోకములో వున్న అందరికి ప్రియపాత్రుడు. చంద్రునివలె నిర్మలము గా ఉండువాడు. గజారోహణ అశ్వారోహణ రధారోహణ చర్యలలో కుశలుడు. ధనుర్విద్యలో కుశలుడు . పితృసేవలో నిమగ్నుడైయుండెడివాడు.

లక్ష్మణుడు బాల్యము నుంచియూ లోకాభిరాముడైన పెద్ద అన్నగారగు రామునియందు భక్తి తత్పరుడు. తనసుఖములను మరచి రామునకు అన్నివిధములుగా ప్రియముగూర్చువాడు. అతడు రామునకు బహిః ప్రాణము. పురుషోత్తముడైన ఆ రాముడు లక్ష్మణుడు తనచెంత లేనిచో నిద్రపోయెడివాడివాడు కాడు, వచ్చిన మృష్టాన్నములను తీసుకొనెడివాడు కాడు. రాముడు అశ్వమునెక్కి వేటాడు నపుడు లక్ష్మణుడు ధనస్సు చేబూని వెంట నడిచెడివాడు.

లక్ష్మణునకు తమ్ముడైన శతృఘ్నుడు అతని వలే సేవాస్వభావము కలవాడు అతడు భరతునకు ప్రాణముకన్న ప్రియమైనవాడు. అట్లే శతృఘ్నుడును భరతునిపై ప్రేమకలవాడు.

ఆట్లు సర్వలక్షణసంపన్నులగు ఆ నలుగురు ప్రియమైన పుత్త్రులతో దశరథమహారాజు దేవగణములతో గూడిన బ్రహ్మదేవునివలె పరమానంద భరితుడాయెను. ఆ నలుగురూ జ్ఞానసంపన్నులు, సద్గుణసంపన్నులూ , లౌకిక ప్రజ్ఞానిథులు, కీర్తిమంతులు , సర్వజ్ఞులు, దూరదృష్టిగలవారు. ఇట్లు ప్రతిభాశాలురూ తేజోమూర్తులైన తనకుమారులులను జూచి లోకాధిపతియగు బ్రహ్మవలే ఆనందించెను.

ఆ పురుషశ్రేష్ఠులైన ( మనుజవ్యాఘ్రులైన) రాజకుమారులు వేదవేదాంగముల ఆధ్యయనములో నిరతులు. పితృ సేవలో నిరతులు ధనుర్విద్యలో నిష్ఠగలవారు. అప్పుడు ఆ రాజు కుమారుల వివాహ ప్రయత్నములతో గురువులతో బాంధవులతో అలోచించసాగెను. అ మహాత్ముడగు దశరథమహారాజు మంత్రులతో ఆలోచించుచుండగా మహాతేజోమయుడైన విశ్వామిత్రమహర్షి అచటికి వచ్చెను.

రాజదర్శనాకాంక్షతో ఆ ముని ద్వారపాలకులతో ఇట్లు చెప్పెను. ' నేను గాధిరాజు కుమారుడను. కుశికుని వంశమువాడను. నాపేరు విశ్వామిత్రుడు. శీఘ్రముగా నారాకను తెలుపుడు' అని. ఆ మాటలను విని సంభ్రాంత మనస్సులతో కలవరపడి ద్వారపాలకులు రాజభవము వద్దకు వెళ్ళిరి. వారు రాజభవనము చేరి విశ్వామిత్రుని రాకగురించి ఆ మహరాజుకి నివేదించిరి.

ఆ వచనములను విని సంతోషముతో పురోహితులను వెంట తీసుకొని బ్రహ్మకడకు ఇంద్రునివలె వెళ్ళెను. అమితమైన తేజస్సుతో వెలుగుచున్న ఆ మహర్షిని చూచి దశరథ మహారాజు మిక్కిలి సంతోషించెను. ఆ రాజు అప్పుడు అర్ఘ్యపాద్యములను సమర్పించెను. ఆ మహర్షి రాజు సమర్పించిన అర్గ్యపాద్యములను ప్రతిగ్రహంచిన పిమ్మట దశరథ మహారాజుతో కుశలప్రశ్నలు గావించెను.

'ఓ రాజా నీ ధనాగారము , దేశము , బంధుమిత్రులు కుశలమేగదా' అని ధార్మికోత్తముడైన ఆ మహర్షి దశరథ మహరాజుని అడిగెను.' ఇంకనూ 'సామంతరాజులో అదుపులో ఉన్నారా? శతృవులందరినీ జయించితివా? యజ్ఞాదిదైవకార్యములు , అతిథి సత్కారములు చక్కగా సాగుచున్నవి కదా?' అని అడిగెను.

పిమ్మట ఆ మునీశ్వరుడు వశిష్ఠుని సమీపించి ఆయనతో కుశలప్రశ్నలు గావించెను. అదే విథముగా ఇతర ఋషులతో యథావిథిగా యథోచితముగా అ మహాముని పరామర్శించెను. ఆ విథముగా గౌరవింపబడినవారై వారందరూ మిక్కిలి సంతసించిరి. పిమ్మట తమతమ యోగ్యతల ప్రకారము అశీనులైరి.

అప్పుడు ఉదారస్వభావముగల దశరథమహారాజు సంతోషముతో పూజించుచూ విశ్వామిత్రునితో ఇట్లనెను. 'ఓ మహర్షీ అమృతము లభించినటులనూ , నీళ్ళు లేని చోట వర్షము కురిసినట్లునూ, సంతానములేనివానికి ధర్మపత్నియందు పుత్త్రులు కలిగినట్లునూ, నష్టపోయినవానికి నిథులు లభించినట్లునూ , మహోత్సవములతో సంతోషము కలిగినటుల మీ రాక మాకు మహదానందము కలిగించినది మీకు స్వాగతము'.

'ఓ ధర్మాత్మా మీ అభీష్ఠమేమి ?మేము ఏమి చేయవలెను ? మీరు అన్నివిధములుగా పాత్రులు. మీ రాక మా అదృష్ఠము. ఈ దినము నా జన్మ సఫలమైనది, నా జీవితము చరితార్థమైనది. పూర్వము రాజర్షి గా వాసిగాంచితిరి. అనంతరము బ్రహ్మర్షిత్వము పొందిరి. కనుక మీరు మాకు చాలాపూజ్యులు. ఓ బ్రహ్మర్షీ! మీ రాక అద్భుతమైనది. మీ రాక వలన మా గృహము పావకమైనది. మీరు ఏ కార్యనిమిత్తము వచ్చిరో తెలుపుడు. మీ కార్యము నెరవేర్చుటకు సిద్ధముగా ఉన్నాను' అని.

'ఓ కౌశికా! కార్యవిషయమున సందేహము వలదు. మీరు దైవ సమానులు. శేషములేకుండా కార్యము చేసెదను. ఒ బ్రహ్మర్షీ! మీ రాకవలన నేను ఆచరించిన సమస్త ధర్మములూ ఫలించినవి'.

అట్లు హృదయమునకు సంతోషమిచ్చు వాక్యములను విని ఉత్తమోత్తమమైన గుణములతో ప్రఖ్యాతికెక్కినవాడును శమదమాది విశిష్ఠగుణ సంపన్నుడును అయిన విశ్వామిత్రమహర్షి పరమానంద భరితుడాయెను.

ఈ విథముగా శ్రీరామజననం అనబడు రామాయణములోని బాలకాండలో పదునెనిమిది సర్గ సమాప్తము.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే అష్టాదశస్సర్గః ||
సమాప్తం ||

ఇతి హృదయసుఖం నిశమ్య వాక్యం
శ్రుతిసుఖమాత్మవతా వినీతముక్తమ్ |
ప్రధితగుణయశా గుణైర్విశిష్టః
పరమఋషిః పరమం జగామ హర్షమ్ ||

తా|| అట్లు హృదయమునకు సంతోషమిచ్చు వాక్యములను విని ఉత్తమోత్తమమైన గుణములతో ప్రఖ్యాతికెక్కినవాడును శమదమాది విశిష్ఠగుణ సంపన్నుడును అయిన విశ్వామిత్రమహర్షి పరమానంద భరితుడాయెను.

||ఓమ్ తత్ సత్ ||


|| om tat sat ||